: మహాదేవుని మందిరం కోసం పోరాడుతున్న ముస్లింలు!
ఇస్లాం పేరిట ఏర్పడ్డ దేశంలో ముస్లిములు ఒక హిందూ మందిరాన్ని కాపాడాలని ఉద్యమం చేస్తున్నారు. మత సామరస్యానికి ప్రతీక భారత్ మాత్రమే కాదు... తమది కూడా అని వారు చాటుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల తలుపులు తడుతూ, ఓ దేవాలయం కోసం ఉద్యమిస్తున్నారు.
పాకిస్థాన్ దేశ పరిధిలోని కరాచీలో 150 ఏళ్ల చారిత్రాత్మక శ్రీ రత్నేశ్వర మహాదేవ్ దేవాలయానికి ఇప్పుడు ప్రమాదం వచ్చి పడింది. దానికి కొద్ది అడుగుల దూరంలోనే ఓ ఫ్లై ఓవర్ నిర్మాణమవుతోంది. భారీ క్రేన్లు, ఎర్త్ మూవర్లు ఉపయోగించి మీటర్లకు మీటర్లు భూమిని తవ్వేస్తున్నారు. ఈ పనుల వల్ల కలిగే ప్రకంపనలతో మహాదేవుడి మందిరానికి ప్రమాదం వాటిల్లుతోంది.
ఆ దేశంలో ఉన్న అతికొద్ది మంది పాకిస్థానీ హిందువులు గుడి కోసం పోరాడే పరిస్థితిలో లేరు. అందుకే, కరాచీలోని ముస్లింలు వారికి అండగా నిలబడ్డారు. పాక్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తసదుక్ హుసేన్ జిలానీ ఈ నిర్మాణం వల్ల దేవాలయంపై ఎలాంటి ప్రభావం ఉంటుందో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.
రత్నేశ్వర్ మహాదేవ్ మందిరానికి ఘనమైన చరిత్ర ఉంది. ఒకప్పటి లాహోర్ లో అతి పెద్ద మందిరాల్లో అదొకటి. అక్కడ మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగేవి. అయితే ఇప్పుడు అదంతా గతం. కానీ, ఆ మహాదేవుని మందిరాన్ని కాపాడుకుంటామంటూ ముస్లింలు ముందుకొస్తున్నారు. అదే విశేషం!