: ఆ ఐఏఎస్ కీచకుడే...అతని ఆస్తులు జప్తు చేయండి: కోర్టు
22 ఏళ్ల యువతికి మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డ సీనియర్ ఐఏఎస్ అధికారి బిబి మహంతి పరారీలో ఉన్నాడని రాజస్థాన్ జైపూర్ మెట్రోపాలిటన్ కోర్టు ప్రకటించింది. ఆయన పరారీలో ఉన్న నేపథ్యంలో ఆయన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ఉన్నతాధికారులకు మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజస్థాన్ సివిల్ సర్వీసెస్ అప్పీలేట్ ట్రైబ్యునల్ ఛైర్మన్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి మహంతి విధులు నిర్వర్తించారు.
సివిల్ సర్వీసెస్ పరీక్షలో పాస్ చేయిస్తానని ఆశ చూపి ఓ 22 ఏళ్ల యువతిని ఢిల్లీలోని తన నివాసానికి రప్పించుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను పెళ్లిచేసుకుంటానని హామీ ఇచ్చాడు. కొంత కాలం తరువాత ఆ యువతి ఉద్యోగం విషయం గురించి మహంతిని ప్రశ్నించగా తనకు సంబంధంలేదని మాట మార్చాడు. దీంతో ఆ యువతి కోర్టును ఆశ్రయించింది.
కోర్టు ఆదేశాలతో అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు, అతన్ని దోషిగా తేల్చారు. దీంతో రాజస్థాన్ ప్రభుత్వం అతనిని సస్పెండ్ చేసింది. జనవరి 25న అతనిపై కేసు నమోదు చేయడంతో అప్పట్నుంచి మహంతి పరారీలో ఉన్నాడు. దీంతో కోర్టు ఆతని ఆస్తుల జప్తుకు ఆదేశించింది.