: కార్గిల్ ఉదంతం పట్ల గర్విస్తున్నా: ముషారఫ్
కార్గిల్ సమీపంలో నియంత్రణ రేఖ వద్ద ఉల్లంఘనలకు పాల్పడడాన్ని పాక్ మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్ సమర్థించుకున్నారు. పైగా, ఆ సంఘటన పట్ల తాను గర్విస్తున్నానని చెబుతున్నారు. 1999లో పాక్ బలగాలు కార్గిల్ వద్ద భారత భూభాగంలోకి చొరబడి పలు ప్రాంతాలను ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. అయితే, భారత దళాల వీరోచిత పోరాటంతో పాక్ సైన్యం తోకముడిచింది.
ఆ సమయంలో ముషారఫ్ పాక్ సైన్యాధిపతిగా విధుల్లో ఉన్నారు. కార్గిల్ పోరు ముగిసిన కొద్దికాలానికే నవాజ్ షరీఫ్ ను పదవీచ్యుతుడిని చేసి ముషారఫ్ పాక్ పగ్గాలు చేపట్టారు. తదనంతర పరిణామాల నేపథ్యంలో స్వీయ బహిష్కరణ విధించుకుని దుబాయ్ లో ప్రవాసం గడిపారు. మే 11న జరిగే ఎన్నికల్లో తన పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్ కు నాయకత్వం వహించేందుకు, ఆయన పాక్ కు తిరిగి వచ్చారు.
ఈ క్రమంలో ఆయన కరాచీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అప్పుడు తాను పాకిస్తాన్ ప్రజల బాగోగులు, దేశ క్షేమం కోరే వ్యక్తుల మధ్య ఉన్నట్టు చెప్పారు. అందుకే సంచలనాత్మక నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు. ఏదేమైనా, కార్గిల్ ఆపరేషన్ పట్ల ఇప్పటికీ గర్విస్తుంటానని ముషారఫ్ నొక్కి చెప్పారు. ఇక ఎన్నికల్లో పార్టీ వర్గాలు తనను కరాచీ నుంచి పోటీ చేయమంటున్నాయని తెలిపారు.