: నా సామిరంగా... ఆ కొన్ని వోట్లు ఇటు వచ్చి ఉంటేనా!!
గెలుపు-ఓటమికి మధ్య వెంట్రుకవాసి మాత్రమే తేడా ఉంటుంది. ఎన్నికల్లో కూడా ఓ గుప్పెడు ఓట్లు అటు నుంచి ఇటు అయితే ఫలితమే మారిపోతుంది. గత లోక్ సభ ఎన్నికల్లోనూ 114 నియోజకవర్గాల్లో గెలుపోటముల మధ్య తేడా కేవలం మూడు శాతం ఓట్లే.
ఉత్తరప్రదేశ్ లో ఉన్న మొత్తం 80 సీట్లలో 19 చోట్ల గెలుపోటముల మధ్య తేడా కేవలం మూడు శాతం మాత్రమే. రాజస్థాన్ లోని టోంక్ సవాయ్ మాధోపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కేవలం 317 ఓట్లతో.. అంటే కేవలం 0.039 శాతం ఓట్ల ఆధిక్యంతో గెలుపు బాట పట్టారు. గత ఎన్నికల్లో గెలుపోటములను గమనిస్తే... యూపీఏ ప్రభుత్వం కూడా కొద్దిపాటి ఓట్ల తేడా వల్ల ఏర్పాటయ్యిందని స్పష్టమైంది. బీజేపీ 56 సీట్లను కేవలం 5,000 ఓట్ల కన్నా తక్కువ మెజారిటీతో కోల్పోయింది. ఇక, 53 స్థానాల్లో కాంగ్రెస్-యూపీఏ పక్షాలు పాతిక వేల కన్నా తక్కువ మెజారిటీతో గెలుపొందాయి.
గత ఎన్నికల్లో తమిళనాడు నుంచి గెలిచిన ఆర్థిక మంత్రి చిదంబరం, యూపీ నుంచి గెలిచిన విదేశీ వ్యవహారాల మంత్రి సల్మాన్ ఖుర్షీద్ లు అలా అతితక్కువ ఓట్ల తేడాతో విజయం సాధించినవారే. మన రాష్ట్రంలో రాజమండ్రి, మెదక్, నర్సరావుపేట నియోజకవర్గాల గెలుపోటములు కూడా అతి తక్కువ ఓట్లతో నిర్ణయించబడ్డాయి. ఆరు స్థానాల్లో గెలుపోటముల మధ్య తేడా కేవలం వెయ్యి ఓట్లే. ఈసారి ఎన్నికల్లోనూ దేశంలోని 114 నియోజకవర్గాల్లో మళ్లీ ఇది జరిగే అవకాశం ఉంది. అందుకే రాజకీయ పార్టీలన్నీ చిన్న చిన్న విషయాలను కూడా వదలకుండా పట్టుదలతో పనిచేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో గెలుపోటముల మధ్య తేడా మొదటి నుంచీ నాలుగు నుంచి ఆరు శాతం లోపే ఉంటూ వస్తోంది. చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ గెలిచిన 1998, 1999లో ఇదే జరిగింది. 2004 ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ టీడీపీ కన్నా 11 శాతం ఎక్కువ ఓట్లతో విజయం సాధించింది. 2009లో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం వల్ల చాలా స్థానాల్లో ఇలా అతి తక్కువ ఓట్ల తేడాతో గెలుపోటములు నిర్ణయించబడ్డాయి. అందుకే ప్రతి ఓటూ కీలకమే. మనం వేసే ఓటే గెలుపోటములను నిర్ణయించవచ్చు. అందుకే, మనం ఈసారి తప్పనిసరిగా ఓటు వేద్దాం.