: పాతబస్తీలో కట్టలకు కట్టల డబ్బు...కిలోల కొద్దీ బంగారం
హైదరాబాదు పాతబస్తీలో గత కొద్ది రోజులుగా దొరుకుతున్న డబ్బు, బంగారం చూసి అధికారుల కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గత కొద్ది రోజులుగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. అణువణువూ పరిశోధిస్తున్నారు. భారీ బలగాలను మోహరించి ప్రతి వాహనాన్ని పరీక్షిస్తున్నారు. దీంతో ధనవంతుల ప్రాంతంగా పేరుపడ్డ బంజారాహిల్స్, జూబ్లిహిల్స్ పరిసరాల్లో 13, 15 లక్షలు పట్టుబడుతుండగా, పాతబస్తీలో మాత్రం కట్టలకు కట్టల డబ్బు... కిలోల కొద్దీ బంగారం పట్టుబడుతున్నాయి.
భారీ మొత్తం పట్టుబడడం చూసి పోలీసులే ఆశ్చర్యపోతున్నారు. మొన్న ఒక వాహనంలో రెండు కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకోగా, నిన్న రెండు కేజీల బంగారం పట్టుకున్నారు. తాజాగా ఈ మధ్యాహ్నం పాత బస్తీలోని గోల్కొండ ప్రాంతంలో ఓ ట్రక్కు నుంచి 36 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.