: ఎన్ క్లోజర్ లో దూకిన విద్యార్థి... తోక ముడిచిన పులులు
పులిని చూసి మనిషి భయపడడం సర్వ సాధారణం. కానీ, ఈ ఇంజినీరింగ్ విద్యార్థి పులుల్నే భయపెట్టాడు. వివరాల్లోకెళితే... మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో గాంధీ జంతు ప్రదర్శన శాల ఉంది. అందులో రెండు అరుదైన తెల్లపులులు ఉన్నాయి. ఎప్పటిలాగానే సందర్శకులతో ఆ జూ సందడిగా మారింది. అయితే, స్థానిక ఆనంద్ నగర్ కు చెందిన యశోనందన్ కౌశిక్ అనే ఇంజినీరింగ్ విద్యార్థి ఉన్నట్టుండి ఆ తెల్ల పులులున్న ఎన్ క్లోజర్ లోకి లంఘించాడు. ఇది చూసి సందర్శకులతోపాటు జూ సిబ్బంది కూడా దిగ్భ్రమకు గురయ్యారు.
ఇక, ఆ తెల్ల పులుల ముందుకెళ్ళిన కౌశిక్ తనతో పోరాడండన్నట్టు వాటిని కవ్వించసాగాడు. కానీ, వేటాడే గుణాన్ని ఎప్పుడో మర్చిపోయిన ఆ పులులు కాస్తా తోక ముడిచి పరారయ్యాయి. అయినా గానీ కౌశిక్ వాటిని రెచ్చగొడుతూనే ఉన్నాడు. చివరికి జూ సిబ్బంది ఆ ఎన్ క్లోజర్ లోకి ప్రవేశించి కౌశిక్ ను బయటికి తీసుకొచ్చారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ అనంతరం వదిలేశారు. తమ కుమారుడిని మానసిక నిపుణుడి వద్దకు తీసుకెళ్ళి చికిత్స ఇప్పిస్తామని కౌశిక్ తండ్రి పోలీసులకు చెప్పారు.