: మోడీపై కేసు నమోదు
'హర హర మోడీ' నినాదం నేపథ్యంలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై వారణాసి కోర్టులో కేసు నమోదైంది. బీజేపీ ఎన్నికల నినాదం తన మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఉందని మనోజ్ దూబే అనే న్యాయవాది మోడీతో పాటు బీజేపీ జనరల్ సెక్రటరీ అమిత్ షా, వారణాసి నగర మేయర్ రామ్ గోపాల్ మొహాలేపై న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఓట్ల కోసమే ఈ నినాదమని ఆయన తన ఫిర్యాదులో ఆరోపించారు. ఈ విషయంపై ఎన్నికల కమిషన్ కు కూడా ఫిర్యాదు చేస్తానని దూబే వెల్లడించారు.
ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించారు. కాగా, విమర్శల నేపథ్యంలో వెనకంజ వేసిన బీజేపీ తన 'హర హర మోడీ' నినాదాన్ని వెనక్కి తీసుకుని 'అబ్ కీ బార్ భాజపా సర్కార్' నినాదాన్ని తెరమీదికి తెచ్చిన సంగతి తెలిసిందే.