: విమాన శకలాల గుర్తింపుకు వాతావరణం అడ్డంకి
వాతావరణం అనుకూలించకపోవడంతో పాటు హిందూ మహాసముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో మలేసియా విమాన శకలాల గుర్తింపుకు ఆటంకం ఏర్పడింది. హిందూ మహాసముద్రం దక్షిణ ప్రాంతంలో విమానం కూలిపోయినట్టు కొన్ని ఆధారాలు బ్రిటన్ కు చెందిన ఇన్మార్ శాట్ ఛాయాచిత్రాల్లో వెల్లడయ్యాయి. దీంతో, విమానం జలసమాధి అయిందని భావిస్తున్నామని మలేసియా ప్రధాని నజీబ్ రజాక్ నిన్న ప్రకటించారు.
కాగా, విమానం కూలిపోయినట్టు భావిస్తున్న ప్రదేశానికి వెళ్ళేందుకు వాతావరణం సహకరించడంలేదు. అక్కడ పెనుగాలులు వీస్తుండడంతోపాటు సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉందని ఆస్ట్రేలియా మారిటైమ్ సేఫ్టీ అథారిటీ (ఎఎంఎస్ఏ) ప్రకటించింది. పైగా మేఘాలు కూడా తక్కువ ఎత్తులో ఉండడంతో విమానాలు ఎగిరేందుకు అననుకూలత ఏర్పడిందని ఎఎంఎస్ఏ పేర్కొంది.