: బాబు రండి అంటుంటే... జగన్ నిధులు తెండి అంటున్నారు: చిరంజీవి
నెల్లూరు జిల్లాకు చేరిన కాంగ్రెస్ బస్సు యాత్రలో చంద్రబాబు, జగన్ లపై కేంద్ర మంత్రి చిరంజీవి విమర్శనాస్త్రాలు సంధించారు. ఇప్పుడు అధికారం అప్పజెపితే సీమాంధ్రను సింగపూర్ చేస్తామని చంద్రబాబు అంటున్నారని... గతంలో తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశారని ప్రశ్నించారు. అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు విభజనకు సంబంధించిన చర్చలో కూడా కనీసం పాల్గొనలేదని ఆరోపించారు. అదేవిధంగా, సీమాంధ్రకు ప్యాకేజీలు సాధించుకునేందుకు కూడా ఆయన ప్రయత్నించలేదని విమర్శించారు. మరోవైపు వైఎస్సార్సీపీ అధినేత జగన్ పై కామెంట్ చేస్తూ... జగన్ జైల్లో ఉన్నప్పుడే పార్టీ పరిస్థితి బాగుండేదని ఆ పార్టీకి చెందిన ఒక నేత తనతో అన్నారని తెలిపారు. చంద్రబాబు రండి అని పిలుస్తుంటే... జగన్ బాబు నిధులు తెండి అంటున్నారని ఎద్దేవా చేశారు. రోజురోజుకూ వైకాపాకు ఆదరణ తగ్గుతోందని అభిప్రాయపడ్డారు.
రోడ్ షోకు అభిమానులు ఊహించిన స్థాయిలో రావడంలేదని మీడియా అడిగిన ప్రశ్నలకు చిరంజీవి బదులిస్తూ... ఇది రోడ్ షో కాదని, కార్యకర్తలతో సమావేశ యాత్ర అని, ఈ యాత్ర విజయవంతం అయిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మొదలైన వలసలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం పదవీ వ్యామోహంతో కాంగ్రెస్ నేతలు పార్టీని వీడుతున్నారని అన్నారు.