: మోడీ నాకు ఎందుకు నచ్చాడంటే.... : నాగార్జున
నరేంద్ర మోడీ తనకు నచ్చిన రాజకీయ నాయకుడని సినీ నటుడు నాగార్జున కితాబునిచ్చారు. అహ్మదాబాద్ లో నరేంద్ర మోడీని కలిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, గుజరాత్ ను నరేంద్ర మోడీ అద్భుతంగా పరిపాలిస్తున్నాడని ఆకాశానికి ఎత్తేశారు. మోడీ ఆదరణను తాను మర్చిపోలేనని అన్నారు. మోడీని కలవాలని తానెవర్నీ కోరలేదని, రాజకీయాల్లోకి తాను రానని నాగార్జున స్పష్టం చేశారు. వెంకయ్య నాయుడు తనను మోడీని కలవమని, గుజరాత్ ను సందర్శించమని ఆహ్వానించారని, ఆయన ఆహ్వానం మేరకు తాను మోడీని కలిశానని స్పష్టం చేశారు. గుజరాత్ గ్రామీణ ప్రాంతం కూడా బాగా అభివృద్ధి చెందిందని నాగార్జున తెలిపారు.
పల్లెటూర్లో బ్రాడ్ బ్యాండ్, వై-ఫై సౌకర్యం, 24 గంటల విద్యుత్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదులో 3 గంటల విద్యుత్ కోతలు ఉండగా... గుజరాత్ లోని పల్లెల్లో కూడా పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా ఉండడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని ఆయన పేర్కొన్నారు. మోడీలోని నాయకత్వ లక్షణాలు, మోడీ చేసే ప్రసంగాలు ఉత్తేజ పరుస్తాయని ఆయన స్పష్టం చేశారు. బిజీగా ఉండే మోడీ తనతో గంట సేపు గడపడం తనకు ఆనందం కలిగించిందని నాగార్జున తెలిపారు.