: కిరణ్ నిర్ణయంపై గవర్నర్ చర్యలు తీసుకోవాలి: కేసీఆర్
దుమ్ముగూడం ప్రాజెక్టుకు నిధుల విడుదలకు కిరణ్ సీఎం హోదాలో అనుమతివ్వడంపై కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ భవన్ లో నేడు మీడియా సమావేశం నిర్వహించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ, కిరణ్ నిర్ణయంపై గవర్నర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దుమ్ముగూడెం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.8 వేల కోట్ల నుంచి రూ.19 వేల కోట్లకు పెంచారని దుయ్యబట్టారు. అప్పట్లో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పొన్నాల లక్ష్మయ్య అవినీతిపై లోకాయుక్త సిఫార్సు చేసినా కాంగ్రెస్ తొక్కిపెట్టిందని కేసీఆర్ ఆరోపించారు. తానే గనుక పొన్నాల స్థానంలో ఉండుంటే రాజీనామా చేసేవాణ్ణని చెప్పారు. దుమ్ముగూడెం ప్రాజెక్టును తెలంగాణ ప్రజలు అంగీకరించబోరని స్పష్టం చేశారు.