: లోక్ సభ సీటుపై కన్నేసిన పావ్ భాజి విక్రేత


ఆయన పేరు కుషేశ్వర్ భగత్ (43). గుర్గావ్ లో పావ్ భాజి స్టాల్ నడుపుతున్నాడు. రుచికరమైన పావ్ భాజితో గుర్గావ్ వాసులను ఆకట్టుకున్న ఈ బీహారీ ఆ అభిమానం ఓట్ల రూపంలో కురవకపోదా...? అని భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఈ ఎన్నికల్లో గుర్గావ్ నుంచి లోక్ సభకు పోటీ చేయాలని నిశ్చయించుకున్న కుషేశ్వర్ ఓ సదాశయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాడు. దేశంలో విద్యా వ్యవస్థ సక్రమంగా లేదని, ఎన్నో సంస్కరణలు అవసరమన్న విషయాన్ని గుర్తించానని, అందుకే పోటీ చేస్తున్నానని తెలిపాడు.

తొమ్మిదో తరగతి వరకే చదువుకున్న ఈయన తన పిల్లల చదువు పట్ల ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. మంచి పాఠశాలలో చేర్చాడు. అయితే, ఎన్నో నిరుపేద కుటుంబాలకు చెందిన చిన్నారులు ఫీజులు కట్టలేని కారణంగా నాణ్యమైన విద్యకు దూరంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను గెలిస్తే అలాంటి పరిస్థితులను మెరుగుపరుస్తానని హామీ ఇస్తున్నాడీ పావ్ భాజీ వాలా.

అన్నట్టు, ఈయన 2009లోనూ లోక్ సభ ఎన్నికల్లోనూ, అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేశాడు. కానీ గెలవలేదు. బీహార్ లోని మధుబని ప్రాంతానికి చెందిన కుషేశ్వర్ 30 ఏళ్ళ క్రితం ముంబయి చేరుకున్నాడు. అక్కడ ఓ పదేళ్ళు గడిపి పావ్ భాజీ తయారీలో మెళకువలు ఒంటబట్టించుకుని రెండు దశాబ్దాల క్రితం గుర్గావ్ చేరుకుని అక్కడే స్థిరపడ్డాడు.

  • Loading...

More Telugu News