: ఉత్తరాది ఓటర్లను రాజ్-మోడీ ఫొటోలతో భయపెడుతున్న కాంగ్రెస్
బలమైన ప్రత్యర్థిగా అవతరించిన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని దెబ్బతీసే లక్ష్యంతో కాంగ్రెస్ కొత్త ఆలోచనను ఆచరణలో పెట్టింది. మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్ లో కాంగ్రెస్ నేతలు ఉత్తరాది వారి ఓట్లను రాబట్టుకునేందుకు రాజ్-మోడీ ఫొటోలతో భయపెడుతున్నారు. గతంలో మహారాష్ట్రలో స్థిరపడిన ఉత్తరాది వారిని తరిమికొట్టాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే పిలుపునిచ్చారు.
దాంతో ఉత్తరాదివారిపై మహారాష్ట్రలోని ముంబై, తదితర ప్రాంతాల్లో దాడులు జరిగాయి. ప్రస్తుతం రాజ్ ఠాక్రే మోడీకి మద్దతు పలుకుతుండడంతో.. వారిద్దరి ఫొటోలను చూపిస్తూ ఓట్లు రాబట్టుకునేందుకు గుజరాత్ కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు వారిద్దరి ఫొటోలతో కూడిన పోస్టర్లు సూరత్ లో వెలిశాయి. శత్రువుకు శత్రువు మిత్రుడు అయినప్పుడు... ఆ శత్రువు మిత్రుడిని శత్రువులా ఎందుకు భావించకూడదంటూ వాటి ద్వారా సందేశం ఇస్తున్నారు.