: ఎన్నికల వేళ జ్యోతిష పండితులకు డిమాండ్
డబ్బున్నా.. పలుకుబడి ఉన్నా.. ఎన్నికల్లో విజయం వస్తుందన్న ధీమా లేదు. అంతా విధిరాత... అనే నమ్మకం నేతలను జ్యోతిష పండితుల చుట్టూ తిరిగేలా చేస్తోంది. నేతల నమ్మకాల నేపథ్యంలో... పండితులు బిజీ అయిపోయారు. లాలూ ప్రసాద్ యాదవ్ ఒకప్పుడు బీహార్ ను ఏకచత్రాధిపత్యంగా ఏలిన నేత. రైల్వే మంత్రిగా కొత్త ఒరవడిని సృష్టించారు. కానీ, ఇప్పుడేమైంది? కాలం ఆయన్ను వెక్కిరిస్తోంది. దాణా స్కాంలో దోషిగా తేలారు. బీహార్లో ఆయన ప్రభ మసకబారింది. పార్టీ బలహీనపడింది. డూ ఆర్ డై అన్న పరిస్థితిని ఆయన ఎదుర్కొంటున్నారు.
ఈ దురదృష్టానికి కారణం ఏంటమ్మా? అని అడిగితే ఇంట్లో ఉన్న నీటి కొలనే కారణమని జ్యోతిషుల వారు చెప్పారట. మరో ఆలోచన లేకుండా లాలూ దాన్ని కొన్ని రోజుల క్రితమే పూడ్పించేశారు. ఇక్కడ లాలూవారు ఒక్క ఉదాహరణ మాత్రమే. ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో ఎంతో మంది లాలూలానే జ్యోతిష్యాన్ని ఆశ్రయిస్తున్నారు. ఏ రోజున ఏ గడియలో నామినేషన్ వేస్తే గెలుపు ఖాయమో చెప్పాలని అడిగేవారు కొందరైతే.. తమకు కలిసొచ్చేలా నవరత్నాల్లో ఏదైనా ఒక దాన్ని సూచించండంటూ అడిగేవారు ఇంకొందరు. ఇక దైవదర్శనాలు, పూజలు జరిపించుకునేవారూ ఉన్నారు. మరికొందరు సంఖ్యాశాస్త్ర నిపుణులను కూడా ఆశ్రయిస్తున్నారట. అవసరమైతే తమ పేరులో అక్షరాలు మార్చుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు. మొత్తానికి నేతలకు కావాల్సింది గెలుపు.