: అభిమానులకు చెలగాటం..అధికారులకు ప్రాణసంకటం
అభిమానులకు చెలగాటం...అధికారులకు ప్రాణసంకటంలా ఉంది బాంగ్లాదేశ్ తీరు. ప్రపంచకప్ టీ20 మ్యాచ్ సందర్భంగా అక్కడి అధికారుల్లో తీవ్ర ఉత్కంఠ చోటు చేసుకుంది. క్రికెట్ ను అమితంగా అభిమానించే బంగ్లాదేశ్ లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కు అభిమానులు పెద్ద ఎత్తున టికెట్లు కొనుగోలు చేశారు. మరో వైపు మూడు దేశాల్లోని క్రికెట్ అభిమానులు, క్రికెట్ గురించి తెలియని వారు కూడా వీక్షించే ఏకైక మ్యాచ్ భారత్, పాకిస్థాన్ మ్యాచ్.
అలాంటి మ్యాచ్ కు బంగ్లాదేశ్ లో నెలకొన్ని విద్యుత్ సమస్య తీవ్ర అడ్డంకిగా మారింది. మ్యాచ్ ను ప్రత్యక్ష ప్రసారం చేయకపోతే అభిమానులు వీధుల్లోకి వచ్చి విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని బెంబేలెత్తిపోతున్నారు. దీంతో నిరాటంకంగా విద్యుత్ సరఫరా చేసేందుకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రానికల్లా దుకాణాలు, వాణిజ్య సముదాయాలు మూసివేయాలని ఆదేశించారు.
ఏసీలు, ఫ్రిజ్ లు, ఒవెన్లు, విద్యుత్ ను అతిగా వినియోగించుకునే ఉపకరణాలను వాడొద్దని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరో వైపు ఆ దేశంలోని ఆరు అతిపెద్ద ఎరువుల కర్మాగాలకు గ్యాస్ సరఫరా నిలిపివేసింది. ఆ గ్యాస్ ను విద్యుత్ సంస్థలకు కేటాయించింది. యూఏఈ, ఐర్లాండ్ మ్యాచ్ కు స్టేడియంలోని ఫ్లడ్ లైట్లు మొరాయించాయి. భారత్, పాక్ మ్యాచ్ కు అలాంటి ఘటన పునరావృతమైతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో విద్యుత్ అధికారులు అన్ని ఏర్పాట్లలో తలమునకలై ఉండగా, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా బలగాలు పహారా కాస్తున్నాయి.