: విమానంలో హోలీ చిందుల పర్యవసానం... ఇద్దరు పైలట్ల సస్పెన్షన్
హోలీ పర్వదినం సందర్భంగా స్పైస్ జెట్ విమానంలో ఎయిర్ హోస్టెస్ లు తమ చిందులతో ప్రయాణికులను కిర్రెక్కించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విచారణ జరిపిన స్పైస్ జెట్ సంస్థ ఆ విమాన కమాండర్, కో-పైలట్ లను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఎయిర్ హోస్టెస్ లు డ్యాన్సు చేస్తుండగా ఈ సన్నివేశాలను కెమెరాలో బంధించేందుకు కాక్ పిట్ వదిలి బయటికి వచ్చినందుకు కో-పైలట్ ను, అతడిని కాక్ పిట్ వదిలి వెళ్ళేందుకు అనుమతించినందుకు ఫ్లయిట్ కమాండర్ ను విధుల నుంచి తొలగిస్తున్నట్టు సదరు దేశీయ విమానయాన సంస్థ తెలిపింది.
కాగా, హోలీ నాటి ఘటనపై డీజీసీఏ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పైస్ జెట్ లైసెన్స్ ఎందుకు సస్పెండ్ చేయకూడదో చెప్పాలంటూ షోకాజ్ నోటీసు జారీ చేసింది. అయితే, విమానాల్లో ఇలాంటి సెలబ్రేషన్స్ సర్వసాధారణం అంటూ స్పైస్ జెట్ వర్గాలంటున్నాయి. యూరప్ లోని ఓ అగ్రగామి విమానయాన సంస్థ కూడా గతంలో దీపావళి సందర్భంగా విమానంలో ఇలానే సంబరాలు జరిపిందని, అప్పుడు అందరూ ఆ చర్యను హర్షించారని స్పైస్ జెట్ పేర్కొంది.