: మల్కాజ్ గిరిలో మేధావుల సమరం?
ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి మల్కాజి గిరి లోక్ సభ స్థానం వార్తల్లో నానుతూ ఉంది. చంద్రబాబు, విజయశాంతి, పవన్ కల్యాణ్... ఇలా ఎంతో మంది ప్రముఖులు ఇక్కడి నుంచి పోటీ చేస్తారనే వార్తలు వెల్లువెత్తాయి. అయితే, ఈ స్థానంలో రాష్ట్ర మేధావులుగా పేరుగాంచిన వారు బరిలోకి దిగబోతున్నారు. వారే లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ, ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్.
తనకు ఎంపీగా పోటీ చేయాలనే ఆసక్తి ఉందని... ఒక వేళ పోటీ చేస్తే మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తానని జేపీ ఇప్పటికే స్పష్టం చేశారు. మరోవైపు ఎమ్మెల్సీ నాగేశ్వర్ కూడా ఈ ఎంపీ స్థానం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే... నాగేశ్వర్ పోటీ చేస్తే, ఆయనకు ఆమ్ ఆద్మీ పార్టీ సపోర్ట్ చేయనుంది. ఇప్పటికే తమ అభ్యర్థిగా పోటీ చేయాలని నాగేశ్వర్ కు ఆప్ ప్రతిపాదన పంపింది. అయితే, ఆప్ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించిన నాగేశ్వర్... తాను స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేస్తానని ప్రకటించారు. ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసినా... తమ మద్దతును కొనసాగించాలని ఆప్ నిర్ణయించింది. దీంతో, మల్కాజ్ గిరిలో మేధావుల పోరు తప్పదనిపిస్తోంది.