: ఎగురుతున్న విమానంలో స్టెప్పులతో మత్తెక్కించిన హోస్టెస్ లు
ఎయిర్ హోస్టెస్ లు విమాన ప్రయాణికుల అవసరాలు చూడాలి. నింగిలో ప్రయాణిస్తున్న వారిని చిరునవ్వుతో కట్టిపడేయాలి. కానీ, వారు అంతకంటే ఎక్కువే చేశారు. హోలీ రోజున చిందులేశారు. నడుము మెలికలు తిప్పుతూ ప్రయాణికులను మైమరిపించారు. గోవా నుంచి బెంగళూరు వెళుతున్న స్పైస్ జెట్ విమానంలో ఈ నెల 17న ఈ ముచ్చట జరిగింది. రెండున్నర నిమిషాల పాటు ఎయిర్ హోస్టెస్ సహా కేబిన్ క్రూలోని భామలందరూ డాన్సులతో ఆకట్టుకున్నారు. ఈ వీడియోలు యూట్యూబ్ లోకీ వచ్చేశాయి. ఆ రోజున మొత్తం 8 విమానాల్లో డాన్స్ వేయడం కోసం అదనంగా మహిళా సిబ్బందిని సంస్థ ఏర్పాటు చేసింది. దీనిపై పౌరవిమానయాన శాఖ(డీజీసీఏ) స్పైస్ జెట్ ఎయిర్ లైన్స్ కు షోకాజు నోటీసు జారీ చేసింది. లైసెన్స్ ఎందుకు రద్దు చేయరాదో చెప్పాలని వివరణ కోరింది. తన చర్యను స్పైస్ జెట్ సమర్థించుకుంది. డీజీసీఏకు సహకరిస్తామని ప్రకటించింది. ఇలా డాన్స్ వేయడం దేశంలోనే మొదటిసారని తెలిపింది.