: రాజ్యాధికారం కోసం పోరాడుతున్నాం: బాబు
తాము బీసీలకు రాజ్యాధికారం కోసం పోరాడుతున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థ ఉండేదని, దానిని రద్దు చేసిన ఘనత టీడీపీదేనని అన్నారు. అయినప్పటికీ భూస్వాములు రాజ్యమేలుతున్నారని అన్నారు. తమ కార్యకర్తలు ఫ్యాషన్ కోసం జెండాలు పట్టుకుని తిరగడం లేదని పేర్కొన్నారు. రాజ్యాధికారం బీసీల హక్కని, అందుకే టీడీపీ రాజ్యాధికారం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణలో బీసీలు చదువుకోవాలని, అందుకు అనుగుణంగా తాము జీవో విడుదల చేశామని అన్నారు. విద్యకు ప్రాధాన్యత ఇచ్చి అందరూ చదవాలని తలపోశామని తెలిపారు. విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్ మెంటు అందిస్తామని అన్నారు. అధికారంలోకి రాగానే బీసీలకు సబ్ ప్లాన్ కేటాయిస్తామని అన్నారు. సంగీతానికి మారు పేరు నాయీ బ్రాహ్మణులని, అలాంటి నాయీ బ్రాహ్మణులు చెట్లక్రిందకు చేరిపోయారని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. వారిని ఆదరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని అన్నారు. తాము అధికారంలోకి వస్తే వారిని ఆదరించి చూపిస్తామని బాబు స్పష్టం చేశారు.