: ప్రపంచవ్యాప్తంగా 400 మిలియన్ల మంది అధిక బరువుతో బాధపడుతున్నారు
స్థూలకాయంతో కలిగే అనారోగ్య సమస్యలను సర్జరీల ద్వారా నయం చేయవచ్చునన్న నమ్మకం ప్రజల్లో బలపడుతోందని యశోదా ఆసుపత్రి వైద్యులు చెప్పారు. యశోదా ఆసుపత్రుల్లో 100 బేరియాట్రిక్ శస్త్రచికిత్సలు పూర్తయిన సందర్భంగా... చికిత్స పొందిన వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ‘యశోదా’ వైద్యులు మాట్లాడారు. భారతదేశంలో ఊబకాయంతో బాధపడే వారిలో పురుషులు 15 శాతం, స్త్రీలలో 18 శాతం ఉన్నారని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా 40 కోట్లకు పైగా ప్రజలు స్థూలకాయంతో బాధపడుతున్నారని అన్నారు.
స్థూలకాయం సమస్యను నివారించేందుకు ఇటీవలి కాలంలో సర్జరీలు అనివార్యంగా మారే పరిస్థితులు పెరుగుతున్నాయని బేరియాట్రిక్ సర్జన్ డా. ప్రసాద్ బాబు పేర్కొన్నారు. ఈ తరహా సర్జరీల వల్ల సమస్యలు వస్తాయనుకోవడం కేవలం అపోహ మాత్రమేనని ఆయన చెప్పారు. ప్రస్తుతం రక్తపోటు, మధుమేహం, గుండె సమస్యలు, నిద్రలేమితో బాధపడేవారిలో స్థూలకాయం సమస్యగా మారుతోందని ప్రసాద్ బాబు అన్నారు.