: ఆ ఇద్దరు ఆసీస్ డైనమైట్లకు సెహ్వాగే గురువట!
డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్... ఇద్దరూ ఇద్దరే! బంతిని బలంగా బాదడంలో సిద్ధహస్తులు. కాస్త కుడిఎడంగా అంతర్జాతీయ క్రికెట్లో ప్రవేశించిన ఈ ఆస్ట్రేలియా క్రికెటర్లు ఆధునిక క్రికెట్లో తమ గురువు ఎవరంటే వీరేంద్ర సెహ్వాగ్ పేరు చెబుతున్నారు. ప్రస్తుతం టి20 వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ లో ఉన్న ఫించ్ మీడియాతో మాట్లాడుతూ, గత నాలుగు సీజన్ల పాటు ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున ఐపీఎల్ మ్యాచ్ లు ఆడామని, ఆ సమయంలో తమకు సెహ్వాగ్ ఎన్నో మెళకువలు నేర్పాడని చెప్పాడు. తాను, వార్నర్ బ్యాటింగ్ మెరుగుపరుచుకోవడంలో వీరూ పాత్ర మరువలేనిదని తెలిపాడు.
బంతిని ఎంత వీలైతే అంత దూరం కొట్టమని తనకిచ్చిన సలహా ఎంతగానో నచ్చిందని ఫించ్ పేర్కొన్నాడు. వీరూ టెస్టు క్రికెట్లోనూ టీ20 తరహాలో విరుచుకుపడడం తమను ఎంతగానో ఆశ్చర్యపరిచిందని ఈ కంగారూ బ్యాట్స్ మన్ చెప్పుకొచ్చాడు.