: మలేసియా విమానం అదృశ్యంలో కొత్త కోణం... మాల్దీవ్స్ లో కనిపించిందట!


మలేసియా విమానం అదృశ్యంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఇంతవరకు వివిధ దేశాలు వెతుకుతున్న హిందూ మహాసముద్రంలో విమానం లేదని, మాల్దీవ్స్ లో కనిపించిందని స్థానికులు చెబుతున్నారు. మార్చి 6న మాల్దీవ్స్ లోని హువాధూ ద్వీపం మీదుగా అతి తక్కువ ఎత్తులో ఓ జంబో జెట్ విమానం ఎగురుకుంటూ వెళ్లిందని, అది చేసిన శబ్దం ధాటికి చెవులు చిల్లులు పడతాయేమోనని అనుకున్నామని ఆ ద్వీపవాసులు చెబుతున్నారు.

విమానం తెల్లగా ఉందని దానిపై ఎరుపు చారలు ఉన్నాయని, విమానంలో కిటికీలు, తలుపులు కూడా గుర్తించగలిగామని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ విషయం స్థానిక హావీరు న్యూస్ లో కూడా ప్రచురితమైంది. దీంతో ఇప్పటి వరకు చేసిన దర్యాప్తు మళ్లీ మొదటి కొచ్చింది. దీనిపై పలు కథనాలు వినబడుతున్నాయి. రాడార్ల నుంచి తప్పించుకోవాలంటే విమానాలు చాలా తక్కువ ఎత్తులో ఎగరాల్సి ఉంటుంది. ఇలా నిపుణులైన పైలట్లే చేయగలరు.

అంటే పైలెట్, కో పైలెట్లే హైజాకర్లుగా మారారా? లేక విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా ఎలాగోలా విమానాన్ని సురక్షితంగా దించాలని ప్రయత్నించారా? అనేది అంతుబట్టడం లేదు. మరోవైపు విమానం కోసం 26 దేశాలు వెతుకుతున్న ప్రాంతాల్లో మాల్దీవ్స్ లేదు. దీంతో ఈ విమానం సముద్రంలో కుప్పకూలిపోయిందా? లేక మరేదైనా అజ్ఞాత ద్వీపానికి వెళ్లిందా? అనేది అంతుబట్టడం లేదు.

ఇంకో వైపు థాయ్ లాండ్ అధికారులు ట్రాన్స్ పాండర్ ఆపేసిన కొద్ది సేపటి వరకు తమ రాడార్లలో విమానం మిణుకుమిణుకుమంటూ కనిపించిందని, ఆగ్నేయాసియాలోని మలక్కా జలసంధి వైపు వెళ్లిందని, ఆ వివరాలు ఇంతవరకు గమనించలేదని, దర్యాప్తులో భాగంగా పాత రికార్డులు తిరగేస్తుంటే ఈ వివరాలు బయటపడ్డాయని తెలిపింది. దీంతో మలేసియా విమానం కథ కొత్త మలుపు తిరిగినట్టైంది.

  • Loading...

More Telugu News