: మద్యనిషేధం విధించే వారికే ఓటు వేయండి: జ్యోతిర్మయి
రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం విధించే నేతలకే ప్రజలు ఓటు వేయాలని కొండవీటి జ్యోతిర్మయి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బాధ్యత కలిగిన ప్రధాన రాజకీయ పార్టీలు తమ ఎన్నికల హామీపత్రంలో సంపూర్ణ మద్యనిషేధం అంశాన్ని చేర్చాలని ఆమె కోరారు. అధికారంలోకి రాగానే మద్యనిషేధం ఫైల్ పైనే తొలి సంతకం చేయాలని ఆమె సూచించారు. మద్యం, మత్తుపదార్థాల బారిన పడిన బడుగు, బలహీన వర్గాలు ఆర్థికంగా దిగజారటమే కాకుండా అనారోగ్యానికి కూడా గురవుతున్నారని ఆమె అన్నారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుండటంతో ప్రస్తుతం మహిళల రక్షణ ప్రశ్నార్థకంగా మారుతోందని ఆమె ఈ ప్రకటనలో పేర్కొన్నారు. మద్యపాన నిషేధంపై ప్రజల్ని చైతన్యపరిచేందుకు ఏప్రిల్ నెలలో సీమాంధ్ర, తెలంగాణలో పర్యటించనున్నట్లు జ్యోతిర్మయి తెలిపారు.