: ప్రచారం కోసం అమృత్ సర్ వచ్చిన జైట్లీ... కనిపించని సిద్ధూ
సీనియర్ బీజేపీ నేత అరుణ్ జైట్లీ ఎన్నికల్లో పంజాబ్ లోని అమృత్ సర్ నుంచి పోటీ చేస్తుండడంతో సిట్టింగ్ ఎంపీ, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూకు నిరాశ తప్పలేదు. ఆయన అమృత్ సర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి 2004, 2009లో విజయం సాధించారు. ఈసారి కూడా గెలుస్తానని ధీమాగా ఉన్న సిద్ధూ స్థానంలో బీజేపీ అధినాయకత్వం అరుణ్ జైట్లీని ఎంపిక చేసింది.
ఈ నేపథ్యంలో జైట్లీ నేడు ఈ పుణ్యక్షేత్రానికి ఎన్నికల ప్రచారం కోసం వచ్చారు. అయితే, ఆయన కోసం ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమాల్లో సిద్ధూ ఎక్కడా కనిపించలేదు. బదులుగా సిద్ధూ భార్య నవజోత్ కౌర్ (తూర్పు అమృత్ సర్ ఎమ్మెల్యే) బీజేపీ కార్యకర్తలతో కలిసి జైట్లీకి స్వాగతం పలికారు. కాగా, జైట్లీని అభ్యర్థిగా ప్రకటించగానే, సిద్ధూ వ్యాఖ్యానిస్తూ, ఆయన తన గురువులాంటి వాడని పేర్కొన్నారు. తాను ఈ ఎన్నికల్లో మరెక్కడా పోటీచేయబోనని స్పష్టం చేశారు.