: భారత్ రెండో ర్యాంకుకు ఇంగ్లండ్ అడ్డు
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో రెండో ర్యాంకుకు ఎగబాకాలన్న భారత్ ఆశలపై ఇంగ్లండ్ నీళ్ళు చల్లింది. ఎలాగంటారా, రెండ్రోజుల క్రితం ఢిల్లీ టెస్టులో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన భారత్ ఆ సిరీస్ ను 4-0తో క్లీన్ స్వీప్ చేసింది. తద్వారా రెండో ర్యాంకు అవకాశాలను మెరుగుపరుచుకుంది. అయితే, టీమిండియా చాన్సులు.. ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య ఆక్లాండ్ లో జరిగిన టెస్టు ఫలితంపై ఆధారపడాల్సి వచ్చింది.
ఈ మ్యాచ్ డ్రాగా ముగియడంతో రెండో ర్యాంకులో ఉన్న ఇంగ్లండ్ తన స్థానాన్ని పదిలపరుచుకుంది. అయితే, ఈ టెస్టులో గనుక ఇంగ్లీష్ జట్టు ఓటమిపాలై ఉంటే భారత్ రెండో ర్యాంకుకు చేరుకునేది. కానీ, ఇంగ్లండ్ వికెట్ కీపర్ మాట్ ప్రయర్ (110) వీరోచిత పోరాటంతో ఇంగ్లండ్ ఓటమి నుంచి గట్టెక్కింది.
దీంతో, భారత్ మూడో ర్యాంకుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ సీజన్ ఏప్రిల్ 1తో ముగియనుండగా, మూడో స్థానంలో నిలిచిన భారత్ కు రూ. 13.5 కోట్లు దక్కనున్నాయి. ఇక టెస్టు ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో కొనసాగుతున్న దక్షిణాఫ్రికా రూ. 24 కోట్లు కొల్లగొట్టనుంది.