: మోడీ గురించి వికీలీక్స్ ఏమంది..?
వికీలీక్స్ పై భారతీయ జనతాపార్టీ అసహనం వ్యక్తం చేసింది. వచ్చే ఎన్నికల్లో విజయం కోసం మోడీకి వికీలీక్స్ సర్టిఫికెట్ అవసరం లేదని బీజేపీ సీనియర్ నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వి ఢిల్లీలో మీడియాతో అన్నారు. 2011లో వికీలీక్స్ బయటపెట్టిన అమెరికా దౌత్య పత్రాల్లో మోడీ అవినీతి రహిత నేతగా పేర్కొన్నట్లు వార్తలు బయటకు వచ్చాయి. దీంతో మోడీ మద్దతుదారులు.. 'అమెరికా మోడీని చూసి భయపడుతోంది. ఎందుకంటే ఆయన అవినీతి నేత కాదు కాబట్టి' అన్న జూలియన్ అసాంజే మాటలను పేర్కొంటూ పోస్టర్లను పంపిణీ చేయడం మొదలు పెట్టారు. వీటిని వికీలీక్స్ తాజాగా ఖండించింది. నరేంద్రమోడీ అవినీతి రహిత నేత అని, భారత్ లో ఏకైక నిజాయతీ నేత అంటూ తామేమీ సర్టిఫై చేయలేదని స్పష్టం చేసింది. దీంతో బీజేపీ నేత ముక్తార్ అబ్బాస్ స్పందించారు. భారత ప్రజలు మోడీ పాలన కోరుకుంటున్నారని, ఎన్నికలలో ఆయన గెలుపు కోసం వికీలీక్స్ సర్టిఫికెట్ అవసరం లేదన్నారు.