: కేజ్రీవాల్ మతిస్థిమితం కోల్పోయారంటున్న రాందేవ్
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మతి స్థిమితం కోల్పోయినట్టుందని ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ విమర్శించారు. వారణాసిలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై పోటీ చేస్తానని కేజ్రీవాల్ ప్రకటించడంపై రాందేవ్ పైవిధంగా స్పందించారు. కేజ్రీవాల్ కు డిపాజిట్లు కూడా దక్కవని స్పష్టం చేశారు. మోడీపై పోటీకి దిగడం ద్వారా ఓ రకంగా ఆయన కాంగ్రెస్ అజెండాను అమలు చేస్తున్నట్టేనని అభిప్రాయపడ్డారు. సోనియా, రాహుల్ ల మూకుమ్మడి అవినీతిపై కేజ్రీవాల్ మౌనం దాల్చుతున్నారని రాందేవ్ ఆరోపించారు. కేజ్రీవాల్ వారణాసిలో డిపాజిట్టు కూడా దక్కించుకోలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.
కాగా, బీజేపీ లోక్ సభ అభ్యర్థుల జాబితాలో తన అనుయాయుడు నిశికాంత్ యాదవ్ కు చోటు దక్కకపోవడంపై రాందేవ్ అసంతృప్తికి లోనయ్యారు. నిశికాంత్ బీహార్ లోని పాటలీపుత్ర నుంచి పోటీ చేయాలని భావించగా, ఇటీవలే పార్టీలో చేరిన రామ్ కృపాల్ యాదవ్ కు బీజేపీ టికెట్ లభించింది. దీనిపై మాట్లాడుతూ, బీజేపీ అధినాయకత్వం కొన్ని స్థానాల్లో కళంకితులకు టికెట్లిచ్చిందని రాందేవ్ ఆరోపించారు. కర్ణాటకలో బీఎస్ యడ్యూరప్ప, శ్రీరాములు వంటి వ్యక్తులకు టికెట్లివ్వడాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.