: రంగు చల్లేయ్... ఓకే అంటే మూడు ముళ్లు వేసేయ్!
హోలీ పండుగ సందర్భంగా మధ్యప్రదేశ్ లోని పలు గిరిజన ప్రాంతాల్లో జరిగే వివాహ్ బజార్ గురించి చెప్పుకోవాలి. నిమార్, జబువా, ధార్, బద్వానీ, అలిరాజ్ పూర్ ప్రాంతాల్లో భిల్, భైలాల గిరిజన తెగల ప్రజలు హోలీకి వారం రోజుల ముందుగా భాగోరియా మేళా జరుపుకుంటారు. ఇందులో ఆయా తెగలకు చెందిన యువతీ, యువకులు పాల్గొంటారు. నచ్చిన అమ్మాయి లేదా అబ్బాయి మరొకరిపై రంగు చల్లుతారు. అవతలి వారికి కూడా ఇష్టమైతే అదే విధంగా రంగు చల్లి ఇష్టాన్ని తెలియజేస్తారు. దాంతో వారిద్దరూ కలసి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇక ఆ తర్వాత వారిని దంపతులుగా స్థానికులు గుర్తిస్తారు. ప్రేమలో ఉన్నవారైతే ఈ మేళాను చక్కగా వినియోగించుకుంటారు. స్వాతంత్ర్యానికి ముందు ఈ మేళాలో రక్తం పారేదట. శత్రువులు ఒకరిపై మరొకరు దాడికి పాల్పడేవారు. అనంతర కాలంలో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో ఈ మేళా శుభప్రదంగా సాగిపోతున్నది.