: పవన్ వెనకున్న అదృశ్య శక్తి రాజురవితేజ్... ఎవరు?


జనసేన పార్టీ ప్రారంభోపన్యాసం సమయంలో రాజురవితేజ్ పేరు ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. "నా వెనుక డబ్బున్న వారు, రాజకీయ నేతలు లేరు. ఒక్క రాజురవితేజ్ మాత్రమే ఉన్నారు". పవన్ నోటి వెంట వచ్చిన మాటలు ఇవి. దీంతో ఒక్కసారిగా రాజురవితేజ్ ఎవరనే విషయంపై ఆసక్తి పెరిగిపోయింది. రాజురవితేజ్... ఒక పేద కుటుంబంలో జన్మించిన వ్యక్తి... వెయిటర్ గా కెరీర్ ను ప్రారంభించిన వ్యక్తి. సాధారణ స్థాయి నుంచి కంప్యూటర్ ప్రోగ్రామర్ స్థాయికి ఎదిగారు. వాణిజ్య ప్రకటనల కన్సల్టెంట్ గా కూడా పనిచేశారు. 22 ఏళ్ల వయసులో 'యూరిస్కో' అనే కన్సల్టింగ్ ఏజన్సీ ప్రారంభించారు. ఈ కన్సల్టెన్సీ ద్వారా మన దేశంతో పాటు ఆసియా, యూరప్ లలో 100కు పైగా సంస్థలకు సలహాదారుడిగా సేవలందిస్తున్నారు.

భారత్ లోని 65 విద్యా సంస్థలతో కలసి పనిచేశారు. ఆయన ఇప్పటిదాకా 12 పుస్తకాలను రచించారు. వాటిలో 10 పుస్తకాలను దేశంలోని 183 స్కూళ్లలో పాఠ్యాంశాలుగా పెట్టారు. అంతే కాకుండా ఎయిడ్స్ కు సంబంధించి అనేక ఉపన్యాసాలు కూడా ఇచ్చారు. మన సంస్కృతిపై ఒక షార్ట్ ఫిల్మ్ కు స్క్రిప్ట్ అందించడమే కాకుండా, అందులో నటించారు కూడా. ఒక బాలీవుడ్ సినిమాకు స్క్రిప్ట్ అందించారు. ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన 1.20 లక్షల మందికి పునరుద్ధరణ కార్యక్రమాల ద్వారా శిక్షణ ఇచ్చారు. ఈ వివరాలను ఆయన తన వెబ్ పోర్టల్ www.rajuravitej.com లో వెల్లడించారు.

రాజురవితేజ్ వరంగల్ జిల్లాకు చెందినవాడని పవన్ చెప్పినప్పటికీ... ఆయన కరీంనగర్ జిల్లాకు చెందిన వాడని తెలుస్తోంది. చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో యువజన విభాగమైన యువరాజ్యానికి పవన్ అధ్యక్షుడైతే... రాజురవితేజ్ ఉపాధ్యక్షుడు. అయితే అప్పట్లో ఆయన అంతగా వెలుగులోకి రాలేదు. తనను తాను ఒక ఉపన్యాసకర్తగా, ఆలోచనాపరుడిగా, ట్రైనర్ గా, రచయితగా రాజు పేర్కొంటారు. 2002లో 'ఇన్ స్పైర్ ఇండియా' అనే ట్రస్టును ప్రారంభించారు. పలుదేశాల్లో ఆయన ఎన్నో ప్రసంగాలు చేశారు. యువత, పిల్లల కోసం పుస్తకాలు రాస్తున్నారు. దిస్ ఈజ్ రాజురవితేజ్!

  • Loading...

More Telugu News