: పవన్ కల్యాణ్ పార్టీని నేను విమర్శించలేదు: వెంకయ్య నాయుడు
సినీ నటుడు పవన్ కల్యాణ్ కొత్త పార్టీపై తాను విమర్శలు చేయలేదని బీజేపీ జాతీయ నేత వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. తనపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు వెంకయ్య వివరణ ఇచ్చారు. కొత్త పార్టీల ఏర్పాటుపై నెల్లూరులో తాను చేసిన వ్యాఖ్యలపై కొంత తప్పుడు సమాచారం బయటకు వచ్చిందని, తాను చెప్పని మాటలను మీడియాలో ప్రచురించారని ఆయన అన్నారు. తానెప్పుడూ ఎవరినీ వ్యక్తిగతంగా, కించపర్చేలా మాట్లాడబోనని ఆయన చెప్పారు.
కొత్తగా ఒకరు పార్టీ పెడుతున్నప్పుడు ఒక జాతీయ నేత చేసిన వ్యాఖ్యలకు ఎప్పుడూ ప్రాధాన్యం ఉంటుందన్నారు. కాగా, వెంకయ్య పేరిట నెల్లూరులో ఆ పార్టీ రాష్ట్ర నేత కర్నాటి ఆంజనేయరెడ్డి నిన్న ఓ ప్రకటన విడుదల చేశారు. లోక్ కల్యాణం కోసం పవన్ పార్టీ పెడితే మంచిదేనని వెంకయ్య వ్యాఖ్యానించారని ఆయన తెలిపారు. వెంకయ్యపై పవన్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడి ఉంటే బాగుండేదని కర్నాటి అన్నారు.