: బృందావన్ లో వితంతువుల హోలీ కేళి


జీవితంలో పసుపు-కుంకుమలకు దూరమైన వారంతా కలిసి వసంతోత్సవంలో ఆడి పాడారు. వసంతాలు వెలిసిపోయిన వితంతువుల జీవితాల్లో హోలీ పండుగ మళ్లీ రంగులు పూయించింది. మోడువారిన వారి జీవితాల్లో వసంత కేళి ఆనందోత్సాహాలను నింపింది. ఉత్తరప్రదేశ్ లోని బృందావన్ లో సుమారు వెయ్యి మంది వితంతువులు కలసి హోలీ ఆడుతూ మళ్లీ రంగుల లోకంలో విహరించారు. ఈ అపూర్వ ఘట్టం బృందావనంలోని మీరా సహభాగిని ఆశ్రమంలో జరిగింది.

శ్రీకృష్ణుని భక్తులు, పర్యాటకుల సమక్షంలో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ ఆడారు. పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. బృందావన్ చరిత్రలో పెద్ద సంఖ్యలో వితంతువులు హోలీ పండుగ వేడుకల్లో పాల్గొనటం ఇదే తొలిసారి. వసంతోత్సవం కోసం 500 కిలోలకు పైగా రంగులు, గ్యాలన్ల కొద్దీ నీటిని వినియోగించారు.

మహిళల సాధికారత కోసం పాటుపడుతున్న సులభ్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. బృందావనంలో ఉన్న ఆశ్రమాల్లో వేలాది మంది వితంతువులు ఉంటున్నారు. వీరందరి కోసం సాంప్రదాయ రాసలీల నృత్యంతో సహా పలు కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. గతేడాది ఇక్కడ పూలు చల్లుకుని వితంతువులు వసంతోత్సవం జరుపుకున్నారు.

  • Loading...

More Telugu News