: తెలంగాణ టీఆర్ఎస్ చేతిలో ఉంటేనే బాగుంటుంది: కేసీఆర్


తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ చేతిలో ఉంటేనే బాగుంటుందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, గత పద్నాలుగేళ్ళుగా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమంలో అంకితభావంతో పని చేసిందని కితాబిచ్చారు. ఉద్యమం ఉద్ధృతంగా ఉన్నప్పుడు పదేళ్ల పాటు తెలంగాణ ప్రజలు అడిగినా కాంగ్రెస్ పార్టీ నేతలు రాజీనామాలు చేయలేదని గుర్తు చేశారు.

జేఏసీలో చేరినా రాజీనామాలు చేయలేదని ఆయన ఆరోపించారు. రాష్ట్రం ముక్కలైనా ఆంధ్రానేతలు ఉల్టాపల్టా మాట్లాడుతున్నారని అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర పార్టీ పెట్టాడని, గాలి ముద్దుకృష్ణమనాయుడు లాంటి వారితో ప్రమాదం పొంచి ఉందని, అందుకే టీఆర్ఎస్ పార్టీని ప్రజలు గెలిపించాలని ఆయన కోరారు. ఢిల్లీ నుంచి నిధులు తెప్పించుకోవాలంటే జాతీయ పార్టీలతో ఆకట్టుకునేలా మాట్లాడాలని, అది కేవలం టీఆర్ఎస్ పార్టీ వల్ల మాత్రమే సాధ్యమవుతుందని ఆయన అన్నారు.

జాతీయ స్థాయిలో నిధులు రాబట్టుకోవాలంటే టీఆర్ఎస్ బలంగా ఉండాలని అన్నారు. తెలంగాణలో 16 ఎంపీ సీట్లు గెలుచుకుని, కేంద్రంలో చక్రం తిప్పే పార్టీగా టీఆర్ఎస్ ఉండాలంటే ప్రజలంతా తమనే గెలిపించాలని ఆయన సూచించారు. ఆంధ్రావాళ్ల కుట్రలు ఎదుర్కోవాలంటే టీఆర్ఎస్ మాత్రమే అధికారంలో ఉండాలని ఆయన తెలిపారు. భవిష్యత్ భారత దేశాన్ని ప్రాంతీయపార్టీలు పాలిస్తాయని ఆయన జోస్యం చెప్పారు.

ఇది మహత్తరమైన అవకాశం అని, బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కొత్తగా ఊడి పడ్డవి కానందున వాటిని గెలిపించవద్దని అన్నారు. పదేళ్లు కేంద్రంలో మంత్రులుగా ఉన్న కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో ఏ పనైనా చేశారా? అని ఆయన నిలదీశారు.

  • Loading...

More Telugu News