: దేవయానిపై కేసుపెట్టే అధికారం అమెరికాకు లేదు
భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రాగడేపై అమెరికా మరోసారి నేరాభియోగాలు నమోదు చేయడం పట్ల భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇదో ‘అనవసరమైన చర్య'గా పేర్కొంటూ ఈ నిర్ణయం పర్యవసానంగా తీసుకున్న ఏ చర్య అయినా భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం ఉభయ దేశాల మధ్య జరుగుతున్న ప్రయత్నాలపై ‘దురదృష్ట కరమైన’ ప్రభావం చూపగలదని భారత ప్రభుత్వం వ్యాఖ్యానించింది.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు ఈరోజు (శనివారం) మాట్లాడుతూ, భారతదేశానికి సంబంధించినంత వరకు ఈ కేసుకు విచారణార్హత లేదని అన్నారు. దేవయాని ఖోబ్రాగడే స్వదేశానికి తిరిగి వచ్చినందున అమెరికాలోని కోర్టుకు భారతదేశంలో ఉన్న వ్యక్తిపై విచారణ జరిపే అధికారం ఉండదని ఆయన అన్నారు. అమెరికా న్యాయవ్యవస్థకు ఈ కేసులో భారత్ సహకరించదని ఆయన తెలిపారు.