: డాక్టర్ చెంప పగలగొట్టిన అక్షయ్ కుమార్ బాడీగార్డ్
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ బాడీగార్డ్ ఓ డాక్టర్ చెంప పగలగొట్టిన సంఘటన ముంబయిలో చోటుచేసుకుంది. శైలేష్ శర్మ అనే 33 ఏళ్ళ దంత వైద్యుడు ఢిల్లీ నుంచి ముంబయిలోని తన బంధువుల ఇంటికి వచ్చాడు. దైవ దర్శనం కోసం గుడికి వెళ్ళగా అక్కడ అక్షయ్ కుమార్ తాజా చిత్రం షూటింగ్ జరుగుతోంది. అక్కడ తన కారు వద్ద అక్షయ్ నిలుచుని ఉండడాన్ని గమనించిన శైలేష్ అతనికి సమీపానికి వెళ్ళేందుకు యత్నించాడు. ఇంతలో అక్షయ్ బాడీగార్డ్ శైలేష్ ను అడ్డుకున్నాడు.
అంతేగాకుండా పరుషపదజాలంతో దూషించాడు. అతని మొరటు వైఖరిని శైలేష్ ప్రశ్నించాడు. అంతే, ఆ డాక్టర్ చెంప పగిలేలా చాచిపెట్టి ఒక్కటిచ్చుకున్నాడా బాడీగార్డ్. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, ఇంకా కేసు నమోదు చేయలేదు. ఈ వ్యవహారంపై శైలేష్ బంధువు మాట్లాడుతూ, దేవాలయం వద్ద అనుమతి లేకుండా షూటింగ్ జరుపుతున్నారని ఆరోపించారు.