: ఏ పార్టీకి ప్రచారం చేయను: అమీర్ ఖాన్
ఏ రాజకీయ పార్టీకి మద్దతుగా ప్రచారం చేయనని, అయితే ఓటెవరికి వేయాలన్నది ఓటరు వ్యక్తిగత విషయమని బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ అన్నారు. ఈ ఏడాది సినిమా షూటింగ్స్ చేయనని చెప్పిన అమీర్... మొత్తం కాల్ షీట్స్ ను ‘సత్యమేవ జయతే’ కార్యక్రమానికి కేటాయించానని చెప్పారు.
తనపై వచ్చిన అసత్య ఆరోపణల వ్యవహారాన్ని పోలీసులకు అప్పగించానని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని అమీర్ అన్నారు. ఇవాళ 49వ పుట్టినరోజును జరుపుకుంటున్న అమీర్ ముంబైలోని తన నివాసంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా అమీర్ తన పుట్టినరోజును మీడియా ప్రతినిధుల నడుమ జరుపుకుంటున్న విషయం తెలిసిందే.
జన్మదినం సందర్భంగా అమీర్ మాట్లాడుతూ... ఈ ఏడాది రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని, ప్రస్తుతం తన చేతిలో ఏ చిత్రం లేదని చెప్పారు. దాంతో తన సమయమంతా ‘సత్యమేవ జయతే’కి కేటాయిస్తానని ఆయన తెలిపారు. గత సంవత్సరం చాలా బాగా గడిచిందని, ధూమ్-3 విజయవంతం కావడం తనకు ఆనందాన్ని కలిగించిందని అన్నారు. పలు సామాజిక అంశాల నేపథ్యంగా 2012లో వచ్చిన ‘సత్యమేవ జయతే’ దేశ విదేశాల్లోనూ సంచలనం సృష్టిస్తోంది. దీని రెండో భాగం మార్చి నుంచి ప్రసారమవుతోన్న సంగతి తెలిసిందే. స్టార్ గ్రూప్ ఛానళ్లు స్టార్ ప్లస్, స్టార్ ప్రవాహ్, స్టార్ విజయ్, స్టార్ ఉత్సవ్, దూరదర్శన్ లో ఈ కార్యక్రమం ప్రసారమవుతోంది.