: భౌ బౌ ... మంటూ శునకరాజం రికార్డు
కరవడం కన్నా అరవడానికే కుక్కలు ఎక్కువ ప్రాధాన్యత నిస్తాయి. అసలు ఆ అరుపులకే సగం మంది హడలి చస్తారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే చార్లీ కుక్క అరుపు కూడా అలాంటిదే. భౌ ... భౌ .. మంటూ అది అరుపు లంకించుకుందంటే ... దాని అరుపు ఆ వీధి వీధంతా వినపడుతుంది. అందుకే, అదిప్పుడు గిన్నిస్ రికార్డుకి కూడా ఎక్కేసింది. ఈ శునకరాజం స్వస్థలం ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నగరం. 'గోల్డెన్ రిట్రైవర్' జాతికి చెందిన చార్లీ వయసు ఆరేళ్ళు. ప్రపంచంలో అత్యంత ఎక్కువ శబ్దంతో అరిచే కుక్కగా ఇది ఇప్పుడు గిన్నిస్ రికార్డు కొట్టేసింది.
ఇది మొరిగేటప్పుడు వచ్చే శబ్దం 113.1 డెసిబెల్స్ గా నమోదైంది. అంటే ... ఒక రాక్ సంగీత కచ్చేరీ సృష్టించే ధ్వని... ఒక స్టీల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే ధ్వనితో ఈ కుక్క అరుపు సమానమన్నమాట. అంటే ... దీనిది ఎంత భయంకరమైన అరుపో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇంతకు ముందు లండన్లోని జర్మన్ షెపర్డ్ కుక్క నమోదు చేసిన 108 డెసిబెల్స్ ధ్వనిని, ఈ చార్లీగారు తలదన్ని ఇప్పుడు గిన్నిస్ కి ఎక్కారు. మరి, ఇంతిలా మొరిగే కుక్క ఎంతెలా కరుస్తుంది? అనే డౌట్ మీకు రావచ్చు... అయితే, 'బార్కింగ్ డాగ్ డజ్ నాట్ బైట్' (మొరిగే కుక్క కరవదు) సామెత వుండనే ఉందిగా?