: పశ్చిమగోదావరి జిల్లాలో కీచక అధికారి
పశ్చిమగోదావరి జిల్లా డీఆర్ డీఏ పీడీ శివశంకర్ ఐకేపీ అధ్యక్షురాలిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. నిడదవోలు మండలం అట్లపాడు గ్రామానికి చెందిన వివాహిత (32) ఐకేపీ అధ్యక్షురాలిగా పని చేస్తోంది. ఏటూరు సమీపంలోని టీటీడీసీలో జరిగే సమావేశానికి హాజరుకావాలని ఆమెకు ఫోన్ రావడంతో నిడదవోలు ఐకేపీ కార్యాలయంలో పని ముగించుకుని సాయంత్రం టీటీడీసీకి వెళ్లింది. అక్కడ పని పూర్తయ్యేసరికి రాత్రి 10:15 అయ్యింది.
దీంతో ఆమె అక్కడే పడుకుని ఉదయం వెళ్లిపోవాలని భావించింది. ఇంతలో నైట్ వాచ్ మన్ బాబూరావు ఆమెను డీఆర్ డీఏపీడీ శివశంకర్ గెస్ట్ హౌస్ లోని తన రూంకి రమ్మంటున్నారని చెప్పాడు. తరువాత పీడీ శివశంకర్ ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడని, 4:30 ప్రాంతంలో అతనినుంచి తప్పించుకుని అదే సెంటర్ ఉద్యోగులైన ఇందిర, జమునలకు తెలిపింది. తనకు జరిగిన అన్యాయంపై న్యాయసేవాధికార సంస్థను ఆశ్రయించింది.
దీంతో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలికి ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పి.లక్ష్మీశారద ఆదేశించారు.