: చిత్తూరులో గట్టి పోటీ ఎదుర్కొంటున్న ఎంపీ శివప్రసాద్
చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గంలో టీడీపీకి ఈసారి గట్టి పోటీ ఎదురవబోతోంది. 2009 ఎన్నికల్లో సినీ నటుడు చిరంజీవి అప్పుడే కొత్తగా ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీ టీడీపీని ఆందోళనకు గురిచేయగా, ఈ దఫా ఎన్నికల్లో జగన్ కు చెందిన వైఎస్సార్సీపీ, మాజీ సీఎం కిరణ్ ఏర్పాటు చేసిన జై సమైక్యాంధ్ర పార్టీలు సిట్టింగ్ ఎంపీ శివప్రసాద్ విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దశాబ్దాలుగా చిత్తూరు నియోజకవర్గం టీడీపీకి కంచుకోట అయినప్పటికీ ఈ ఎన్నికల్లో మాత్రం వైఎస్సార్సీపీ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో రెండవ స్థానంతో సరిపెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అక్కడ సరైన అభ్యర్థి కూడా దొరకని పరిస్థితి నెలకొంది.
టీడీపీ సిట్టింగ్ ఎంపీ శివప్రసాద్ కు అనుకూలాంశాలు కూడా బాగానే ఉన్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం, పార్టీకి బలమైన క్యాడర్ ఉన్న పలమనేరు నియోజకవర్గం, చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోనే ఉండటం శివప్రసాద్ కు ప్లస్ అనే చెప్పాలి. ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్లే చిత్తూరు ఎంపీ సీటును ప్రభావితం చేయగలరు. మరో వైపు, ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ కూడా చిత్తూరు జిల్లాకు చెందిన నాయకుడే కావడంతో ఆయన సొంత పార్టీ జై సమైక్యాంధ్ర ప్రభావం కూడా జిల్లాలో కొంత మేరకు ప్రభావం చూపే అవకాశం ఉంది.