: ‘జగన్ బాణం’ మళ్లీ దూసుకొస్తోంది..!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున జగన్ సోదరి షర్మిల కడప, నెల్లూరు జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు ఆమె ఈ రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆ వెంటనే నెల రోజుల్లో లోక్ సభ, శాసనసభ ఎన్నికలు జరిగేందుకు షెడ్యూలు విడుదలైంది. వరుస ఎన్నికలతో వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రచారానికి సిద్ధమయ్యాయి. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని షర్మిల ప్రచార భేరిని మోగించనున్నారు.
17వ తేదీ సాయంత్రం ఆత్మకూరులో ఎంపీ మేకపాటి ఆధ్వర్యంలో షర్మిల ఎన్నికల ప్రచారభేరిని మోగిస్తారు. 18వ తేదీ ఉదయం వెంకటగిరిలో బహిరంగ సభ, నాయుడు పేటలో రోడ్ షో అనంతరం సూళ్లూరుపేటలో ఆమె ప్రసంగిస్తారు. 19వ తేదీ ఉదయం రోడ్ షో, నెల్లూరులో బహిరంగసభ, 20న కావలిలో రోడ్ షో జరిపి మున్సిపల్ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారు.