: క్రికెట్ కోసం సినిమాలు పక్కనబెట్టిన సొట్టబుగ్గల సుందరి
రెండు పడవలపై కాళ్ళు పెట్టి ప్రయాణం చేయడం అన్నివేళలా సరికాదన్నది ఓ నానుడి! ఇది బాలీవుడ్ సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటాకూ అనువర్తిస్తుంది. అందుకే, ఆమె తన సినిమా ప్రాజెక్టులన్నీ పక్కనబెట్టి ఐపీఎల్ తాజా సీజన్ పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంది. ఐపీఎల్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంచైజీకి ప్రీతి సహయజమాని అన్న సంగతి తెలిసిందే. లీగ్ పాలక మండలి ఐపీఎల్ షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ప్రీతి తన ఫ్రాంచైజీ వ్యవహారాలను చక్కదిద్దేందుకు సమాయత్తమయింది.
దీనిపై మాట్లాడుతూ, ప్రస్తుతం తాను 'భయ్యాజీ సూపర్ హిట్' తో పాటు మరికొన్ని చిత్రాల్లో నటిస్తున్నానని, ఐపీఎల్ కారణంగా షూటింగ్ ను కొద్ది నెలల పాటు వాయిదా వేస్తున్నామని తెలిపింది. ఇక, వేలంలో వీరేంద్ర సెహ్వాగ్ ను కొనుగోలు చేసిన ప్రీతి, తాజా సీజన్ లో వీరూ ఒక్కడిపైనే జట్టు ఆధారపడదని, సమష్టి కృషినే నమ్ముతానని తెలిపింది. ఆసీస్ స్పీడ్ స్టర్ మిచెల్ జాన్సన్ జట్టులో చేరడం లాభిస్తుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది.