: ఐపీఎల్-7లో ఫిక్సింగ్ కు పాల్పడితే జీవితకాల నిషేధం
ఫిక్సింగ్ కారణంగా ఐపీఎల్ గత సీజన్ అప్రదిష్ఠపాలైన సంగతి తెలిసిందే. అయితే, తాజా సీజన్ లో ఏ ఆటగాడైనా ఫిక్సింగ్ కు పాల్పడితే జీవితకాల నిషేధం తప్పదని బీసీసీఐ సీనియర్ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా హెచ్చరించారు. ఆటలో అవినీతిని ఏమాత్రం ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు. యూపీలోని జాన్ పూర్ లో భోజ్ పురి సినీ స్టార్ రవికిషన్ తరపున ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న శుక్లా మీడియాతో మాట్లాడారు.
'గత సీజన్ లో స్పాట్ ఫిక్సింగ్ వెలుగుచూసిన అనంతరం బీసీసీఐ, ఐపీఎల్ పాలకమండలి అప్రమత్తమయ్యాయి. ఐపీఎల్-7లో ప్రతి మ్యాచ్ పైనా నిశిత పరిశీలన ఉంటుంది. ఐసీసీ యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ యూనిట్ (ఏసీఎస్యూ) కు అందే ఏ ఫిర్యాదునైనా సీరియస్ గా తీసుకుంటాం. ఆటగాడు తప్పుచేసినట్టు తేలితే జీవితకాల నిషేధానికి వెనకాడబోము' అని శుక్లా తెలిపారు.