: మటన్ బిర్యానీ వడ్డించలేదని పెళ్ళి క్యాన్సిల్!
వరుడి తరపు బంధువులు మటన్ బిర్యానీ డిమాండ్ చేయగా, వధువు కుటుంబ సభ్యలు చికెన్ బిర్యానీ వడ్డించారు... సీన్ కట్ చేస్తే పెళ్ళి క్యాన్సిల్ అయింది. బెంగళూరులో జరిగిందీ ఘటన. సైఫుల్లా, యాస్మిన్ తాజ్ అనే జంటకు పెళ్ళి నిశ్చయించారు పెద్దలు. నిన్న స్థానిక కేజీ హళ్ళిలోని ఓ మసీదు వద్ద నిఖా జరిపించేందుకు ఏర్పాట్లు చేశారు. పెళ్ళి రిసెప్షన్ సందర్భంగా తమకు మటన్ బిర్యానీ వడ్డించాలని వరుడు సైఫుల్లా బంధువులు కోరగా... యాస్మిన్ కుటుంబీకులు 30 కిలోల చికెన్ తో సరిపెట్టాలని నిర్ణయించుకున్నారు. దీంతో, ఇరువర్గాల మధ్య వాగ్వివాదం మొదలైంది.
ఇంత చిన్న విషయానికే సర్దుకోలేకపోతే, భవిష్యత్తులో పెళ్ళికొడుకు ఇంకెన్ని సమస్యలు సృష్టిస్తాడోనని వధువు బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ఇరువైపుల నుంచి పెద్దలు సమావేశమై చర్చించినా రాజీ కుదరలేదు. దీంతో పెళ్ళి రద్దు చేసుకోవడమే మేలని ఇరు వర్గాలు తీర్మానించాయి.