: అవకాశవాదులకు సీట్లివ్వం: బాబు
వచ్చే ఎన్నికల్లో అవకాశవాదులకు సీట్లివ్వబోమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అభ్యర్థుల గత చరిత్రను కూలంకషంగా పరిశీలించిన మీదటే ఎంపిక చేస్తామని ఆయన చెప్పారు. ఈ విషయంలో కార్యకర్తల అభిప్రాయాలకూ విలువిస్తామని బాబు నొక్కి చెప్పారు. ప్రస్తుతం బాబు తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు.
ఈరోజు ఆయన రాజమండ్రి, రాజమండ్రి రూరల్ నియోజకవర్గాల కార్యకర్తలు, నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్యకర్త నుంచి ఎంపీ వరకు పార్టీలో ప్రతి ఒక్కరూ ప్రతి గ్రామంలోనూ పర్యటించాలని ఆదేశించారు. కాగా, వ్యక్తిగత రహస్య ఎస్ఎంఎస్ విధానం ద్వారా కార్యకర్తలు తమ అభిప్రాయం పంపేలా ఓ సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలని స్థానిక కార్యకర్త ఒకరు సూచించారు. ఈ విషయాన్ని పరిశీలిస్తామని బాబు హామీ ఇచ్చారు.