: మోడీ వీర వెర్రి అభిమాని
అభిమానం ఏ పనైనా చేయిస్తుంది. బీహర్లో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీకి ఒక వీరాభిమాని ఉన్నాడు. దర్భంగాకు చెందిన సంతోష్ జా మోడీని పిచ్చిగా అభిమానిస్తాడు. అదే స్థాయికి చేరిందటే... చివరికి తనకు జీవనాధారం అయిన ఆటోను అమ్మి వచ్చిన డబ్బులతో మోడీ సభల్లో పాల్గొంటున్నాడు. ఎన్నికల సందర్భంగా మోడీ బీహర్లో పలు బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే పాట్నా, పూర్ణియా, ముజఫర్ నగర్ లో మోడీతో బీజేపీ సభలను నిర్వహించింది. మోడీ ఉన్న చోట తానూ ఉంటానంటూ ఈ సభలన్నింటికీ హాజరై సంతోష్ తన అభిమానాన్ని చాటుకున్నాడు. వచ్చే నెల 24న సహస్రలో కూడా మోడీ ర్యాలీ జరగనుంది. కానీ, సంతోష్ దగ్గర సభకు వెళ్లడానికి సరిపడా డబ్బుల్లేవు. దీంతో తన జీవనాధారం అయిన ఆటోరిక్షాను అమ్మేశాడు. 'మోడీపై నాకున్న ప్రేమను ఎవరూ పోగొట్టలేరు. ఖర్చు పెట్టగల స్తోమత ఉన్నంతవరకూ మోడీ సభలకు హాజరవుతా' అంటూ సంతోష్ చెప్పాడు.