: అవినీతికి తావు లేకుండా అభివృద్ధికి నాంది పలకాలి: చంద్రబాబు
అభివృద్ధికి మారుపేరు తెలుగుదేశం పార్టీ అని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. హైదరాబాదులోని తన నివాసంలో ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడారు. అండమాన్ నికోబార్ లో సైతం పార్టీ కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. అండమాన్ నికోబార్ లో ఉన్న తెలుగు ప్రజల కోసం టీడీపీ సహకరిస్తుందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని ఆయన విమర్శించారు. గత పదేళ్లుగా రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రానికి సమర్థమైన నాయకత్వం కావాల్సిన అవసరముందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పారదర్శకతకు మారుపేరు తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. అవినీతికి తావు లేకుండా అభివృద్ధికి నాంది పలకాలని చంద్రబాబు ఆకాంక్షించారు.