: బాలీవుడ్ కు ఎన్నికల జ్వరం
ఈ వేసవిలో మన దేశం ఎన్నికలకు సిద్ధమవుతుండగా, బాలీవుడ్ ను సైతం ఎలక్షన్ ఫీవర్ చుట్టుముట్టింది. ఇప్పుడక్కడ నిర్మితమవుతున్న చిత్రాల్లో అత్యధికం రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్నాయి. సామాజిక చైతన్యం కథాంశంగా వచ్చిన చిత్రం 'గులాబ్ గ్యాంగ్' ఇటీవలే విడుదల కాగా, కంగనా రనౌత్ కథానాయికగా తెరకెక్కిన 'రివాల్వర్ రాణి' నేడు విడుదలైంది. ఇది రాజకీయ నేపథ్యంలో వచ్చే ప్రేమకథాచిత్రం. ఇక ప్రియాంకా చోప్రా ప్రధానపాత్రలో వస్తున్న చిత్రం 'మేడమ్ జీ'. దీనికి మధుర్ భండార్కర్ దర్శకుడు.
కాగా, యువ నాయిక సోనమ్ కపూర్ నటిస్తున్న తాజా చిత్రంలో ఇద్దరు రాజకీయవేత్తల మధ్య నడిచే ప్రేమను తెరకెక్కిస్తున్నారు. ఎన్నికల్లో వారిద్దరూ పరస్పరం పోటీపడతారు. తమ చిత్రం తప్పక విజయం సాధిస్తుందని ఈ చిత్ర నిర్మాత, సోనమ్ తండ్రి అనిల్ కపూర్ ధీమా వ్యక్తం చేశారు. వీటికి తోడు యువ ప్రధాని పాత్రలో జాకీ భగ్నాని నటించిన యంగిస్తాన్ కూడా విడుదలకు ముస్తాబవుతోంది. ఇందులో భగ్నాని పాత్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ ను పోలి ఉంటుందని ఫిలిం వర్గాల టాక్. ఇక, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పాత్ర తీరుతెన్నులతో పరేశ్ రావల్ తో ఓ చిత్రం రూపొందించనున్నట్టు తెలుస్తోంది.