: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్...?


భారతీయ జనతాపార్టీతో పొత్తుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీడీపీ నేతలకు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా తెలియజేసినట్లుగా సమాచారం. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పనిచేయాలని నేతలకు సూచించినట్లు తెలియవచ్చింది.

కాగా, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలతో ఏ స్థాయిలో కూడా కలిసి పనిచేయవద్దని నేతలకు చంద్రబాబు సూచించారు. స్థానికంగా ఉన్న బీజేపీ నేతలతో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన ఆదేశించారు. ఈ ఆదేశాల ద్వారా బీజేపీతో కలిసి పనిచేయాలని చంద్రబాబు పరోక్షంగా పార్టీ శ్రేణులకు, ముఖ్య నేతలకు క్లారిటీ ఇచ్చినట్టయింది.

గత రెండు రోజులుగా చంద్రబాబు పార్టీలోని ముఖ్యనేతలందరిని పిలిపించుకుని విడివిడిగా చర్చలు జరుపుతున్నారు. బీజేపీతో కలిసి వెళ్లే అంశంపై నేతల అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటున్నారు. సీమాంధ్రను అభివృద్ధి చేయాలంటే కేంద్రం అండదండలు అవసరమని, కాబట్టి, బీజేపీతో కలిసి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందని బాబు స్పష్టత ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం రెండు పార్టీల మధ్య మున్సిపల్ ఎన్నికల వరకు పొత్తు ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

  • Loading...

More Telugu News