: హైదరాబాదులో 'రూ.5కే భోజనం' పథకానికి విశేష స్పందన
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఇటీవల ప్రవేశపెట్టిన 'ఐదు రూపాయలకే భోజనం' పథకానికి విశేష స్పందన లభిస్తోంది. నాంపల్లి వద్ద ఏర్పాటు చేసిన స్టాల్ వద్ద గత మూడు రోజులుగా విపరీతమైన రద్దీ నెలకొందని అధికారులు తెలిపారు. ఈ భోజనం మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకే అందుబాటులో ఉంటుంది. భోజనం పంపిణీ సమయం కంటే ముందే స్టాళ్ళ వద్ద ప్రజలు బారులు తీరుతున్నారని అధికారులు చెప్పారు. తొలుత వచ్చిన 300 మందికే భోజనం అందిస్తామని వారు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ నగరవ్యాప్తంగా ఇలాంటివి 50 స్టాళ్ళను ఏర్పాటు చేసింది.