: మొబైల్ ఫోనుకు బానిసైతే... కుటుంబ బంధాలు బెడిసికొడతాయ్!
ఆఫీస్ ఫోన్ కాల్స్ కు స్పందించడం, ఈ-మెయిల్స్ పంపడం, గేమ్స్ ఆడటం... ఇలా అత్యధికులు మొబైల్ ఫోన్ ఎక్కువగా వాడుతుంటారు. చివరకు కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసేటప్పుడు కూడా ఫోన్ ను వినియోగించేవారు చాలా మందే ఉంటారు. మీరు కూడా డిన్నర్ పూర్తయ్యే వరకు ఫోన్ పక్కన పెట్టకుండా మాట్లాడుతూనే ఉంటారా? మీలో ఎవరికైనా ఈ అలవాటు ఉంటే మానుకోవాల్సిందేనంటూ అమెరికాకు చెందిన పరిశోధకులు సూచిస్తున్నారు. ఫోన్ కాసేపు పక్కనబెట్టి పిల్లలతో సరదాగా గడపాలని వారు చెబుతున్నారు. లేకుంటే పిల్లలకు తల్లిదండ్రులతో అనుబంధం తగ్గిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
బోస్టన్ మెడికల్ సెంటర్ కు చెందిన పరిశోధకులు 55 మంది తల్లిదండ్రులపై పరిశోధన చేశారు. హోటళ్లు, రెస్టారెంట్లలో పిల్లలతో కలసి భోజనం చేసేటప్పుడు పెద్దల వ్యవహార శైలి, పిల్లల ప్రవర్తనపై అధ్యయనం చేశారు. కొంతమంది భోజనం మొదలైన దగ్గర నుంచి రెస్టారెంట్ విడిచి వెళ్లేంత వరకు ఫోన్ వదిలిపెట్టరు. ప్రతి ముగ్గురు తల్లిదండ్రుల్లో ఒకరికి ఈ అలవాటు ఉందని తేలింది. 73 శాతం మంది భోజన సమయంలో కనీసం ఒక్కసారైనా ఫోన్ వాడుతారని పరిశోధనలో వెల్లడైంది. దీని వల్ల పిల్లలకు తల్లిదండ్రులపై అనుబంధం తగ్గుతుందని వారు చెబుతున్నారు. తల్లిదండ్రులు ఆప్యాయంగా గడపకపోవడం వల్ల పిల్లల మనసు గాయపడుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.