: కేరళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేపై అత్యాచారం కేసు, ఎమ్మెల్యే అరెస్ట్
మహిళా బాధితురాలు ఫిర్యాదు మేరకు కేరళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎ.పి. అబ్దుల్లాకుట్టిపై అత్యాచారం కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అతడిపై పలు సెక్షన్ల కింద తిరువనంతపురంలోని కంటోన్మెంట్ వనితా పీఎస్ లో కేసు నమోదు చేసినట్టు వారు చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం... కన్నురు ఎమ్మెల్యే అబ్దుల్లాకుట్టి నగరంలోని ఓ హోటల్ లో తనపై అత్యాచారం చేశాడని ఓ మహిళ తిరువనంతపురం పోలీసులకు ఈ నెల 3వ తేదీన ఫిర్యాదు చేసింది. తనకు తరచుగా ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడటమే కాకుండా అత్యాచార విషయం బయటకు వెల్లడిస్తే చంపేస్తానని బెదిరించాడని బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొంది.
ఆ ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం నాడు ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు. అబ్దుల్లాకుట్టి గతంలో సీపీఐ(ఎం) తరపున పోటీ చేసి రెండు సార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి కన్నురు శాసనసభా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే, బాధిత మహిళ చేసిన ఆరోపణలను ఎమ్మెల్యే అబ్దుల్లా తోసిపుచ్చారు. ఆమె ఆరోపణలు నిరాధారమైనవని ఆయన ఖండించారు.